ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తెర లేచింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం నూతన పార్టీ ఏర్పడనుంది.
ఎన్నికలకు కాలం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.
సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. జై తెలుగు పేరిట తాను పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడలో విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
40 ఏళ్ల కిందట తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం ఏర్పాటైంది. అయితే తెలుగు భాష సంరక్షణ కోసం జొన్నవిత్తుల మరో పార్టీని ఏర్పాటు చేయనున్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పాటైన తొలి పార్టీగా జై తెలుగు చరిత్రకెక్కింది.
DETAILS
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం : జొన్నవిత్తుల
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో జై తెలుగు పార్టీ తరఫున పోటీ చేస్తామని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించే ఏకైక లక్ష్యంతో ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నానన్నారు.
భాషా, సంస్కృతి పరంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వీధిన పడిపోయిందన్న జొన్నవిత్తుల, విలువలను కాపాడేందుకే నేతలు, ప్రజలు పనిచేయాలని కోరారు.
ఆగస్ట్ 15 నాటికి పార్టీ విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించామన్నారు.
1. నీలం రంగు నీటికి,
2. పచ్చ రంగు వ్యవసాయానికి,
3. ఎరుపు రంగు శ్రమశక్తికి,
4. పసుపు రంగు వైభవానికి చిహ్నం,
5. తెలుపు రంగు జల వనరులు స్వచ్ఛంగా ఉండటానికి అని వివరించారు.