కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.
ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో అమెరికాలోని వాషింగ్టన్‌లో రెండు రోజుల క్రితం రహస్యంగా సమావేశమైనట్లు బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.
అటు కెనడా కానీ, ఇటు భారత్ కానీ ఈ సమావేశాన్ని ధృవీకరించలేదు.
భారత్‌లో అదనంగా ఉన్న కెనడా దౌత్యవేత్తలు దేశ విడిచి వెళ్లాలని మోదీ ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో స్పందించిన కెనడా విదేశాంగ మంత్రి.. భారత్‌తో దౌత్య పరమైన సమస్యను ప్రైవేట్ చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కెనడా
30మంది దౌత్య సిబ్బందిని కౌలాలంపూర్, సింగపూర్‌కు తరలించిన కెనడా
అదనంగా ఉన్న కెనడా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని కేంద్రం డెడ్ లైన్ విధించడంతో ఆ దేశం వెంటనే చర్యలు చేపట్టింది.
తొలి విడతగా 30మంది దౌత్య సిబ్బందిని కౌలాలంపూర్, సింగపూర్‌కు తరలించినట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 19న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్-కెనడా మధ్య దూరాన్ని పెంచింది.
నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్-కెనడా మధ్య మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. అవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పింది.