Loading...
Balendra Shah: భారత్‌-నేపాల్ సంబంధాల బలోపేతంపై జైశంకర్,బలేంద్ర షా చర్చలు
భారత్‌-నేపాల్ సంబంధాల బలోపేతంపై జైశంకర్,బలేంద్ర షా చర్చలు

Balendra Shah: భారత్‌-నేపాల్ సంబంధాల బలోపేతంపై జైశంకర్,బలేంద్ర షా చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా భారత్‌లో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. నేపాల్ ప్రధానిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నేపాల్‌తో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బలేంద్ర షా భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. నేపాల్‌తో స్నేహపూర్వక సంబంధాలకు భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సోమవారం ప్రధాని మోదీతో జరగనున్న సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ తన పోస్టులో వెల్లడించారు.

వివరాలు 

మోదీతో ద్వైపాక్షిక చర్చలు

నేపాల్ ప్రధాని బలేంద్ర షా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్, నేపాల్ మధ్య వాణిజ్యం, వ్యాపారం, అభివృద్ధి సహకారం, ఇంధనం, జలవనరులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

వీటితో పాటు డిజిటల్ అనుసంధానం, స్టార్టప్‌లు, సాంకేతికత, ఆవిష్కరణలు, క్రీడలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపైనా ఇరు దేశాల నేతలు దృష్టి సారించనున్నారు.

ముఖ్యంగా జలవిద్యుత్ ఉత్పత్తి, రైల్వేలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకునే మార్గాలపై చర్చించనున్నారు.

వివరాలు 

రాష్ట్రపతి ముర్ముతోనూ భేటీ

ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈ పర్యటనలో ప్రారంభించే అవకాశం ఉంది.

అలాగే, భవిష్యత్తులో చేపట్టాల్సిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలను కూడా ఇరు దేశాలు ముందుకు తీసుకెళ్లనున్నాయి.

భారత్ పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధాని బలేంద్ర షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు.

2026 మార్చిలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

అంతేకాకుండా, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేపట్టిన తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన కూడా ఇదే కావడం విశేషం.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్‌లో నేపాల్ ప్రధాని బలేంద్ర షా పర్యటన

ADVERTISEMENT