నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. నిజ్జర్ హత్యపై కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం మధ్య, కెనడాలో వేర్పాటువాద గ్రూపులు, హింస, తీవ్రవాదంతో ముడిపడి ఉన్న వ్యవస్థీకృత నేరాలపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలో రాజకీయ పరిస్థితులే ఈ పరిణామాలు కొనసాగడానికి ప్రధాన కారణమని ఆయన నొక్కి చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో హింస, తీవ్రవాద సంఘటనలతో పాటు వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన నేరాలు గణనీయంగా పెరిగినట్లు ఆయన వివరించారు.
నేను 'ఫైవ్ ఐస్'లో భాగం కాదు: జైశంకర్
నిజ్జర్ హత్యకు సంబంధించి 'ఫైవ్ ఐస్' కూటమి కెడనాతో నిఘా సమాచారాన్ని పంచుకోవడం, అలాగే సిక్కు నాయకులకు ప్రాణహాని ఉందని అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ హెచ్చరించినట్లు వచ్చిన వార్తలపై జైశంర్‌ను అడగ్గా.. ' నేను ఫైవ్ ఐస్‌లో భాగం కాదు, నేను కచ్చితంగా ఎఫ్‌బీఐలో కూడా భాగం కాదు. కాబట్టి మీరు తప్పు వ్యక్తిని అడుగుతున్నారు' అని సమాధానం చెప్పారు. 'ఫైవ్ ఐస్' నెట్‌వర్క్ అనేది అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లతో కూడిన ఇంటెలిజెన్స్ నిఘా కూటమి. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కెనడియన్ పౌరుడైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం తారాస్థాయికి చెరుకుంది.
కెనడా మాకు సమాచారం ఇస్తే కచ్చితంగా పరిశీలిస్తాం: జైశంకర్
కెనడాలోని భారత అధికారులకు నిజ్జర్‌పై దాడి గురించి ముందే తెలుసని సాక్ష్యాలను చూపించడానికి ఉద్దేశించిన పత్రాలను భారతదేశానికి అందించినట్లు వస్తున్న వార్తలపై కూడా జైశంకర్ స్పందించారు. తమకు నిర్దిష్ట లేదా సంబంధిత సమాచారం ఇస్తే, తాము దానిని చూడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కెనడాలో వేర్పాటువాద శక్తులు, వ్యవస్థీకృత నేరాల గురించిన సమాచారం గురించి తాము చాలాసార్లు ఆ దేశంతో పంచుకున్నామని ఆయన వెల్లడించారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వేర్పాటువాదులను అప్పగించాలని చాలా అభ్యర్థనలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఆ దేశంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ అభ్యర్థలను తోసిపుచ్చినట్లు ఆయన చెప్పారు.