
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని కట్‌రా-కాజీగుండ్ మధ్య రైలు.. విజయవంతంగా రౌండ్ ట్రిప్ పూర్తి.. సైనిక దళాల రాకపోకలకు మరింత ప్రయోజనకరం
ఈ వార్తాకథనం ఏంటి
పర్వతాలను ఆనుకొని విస్తరించిన జమ్ముకశ్మీర్‌లో ప్రయాణాల వేగాన్నిపెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక అమలులోకి వచ్చింది.
కట్‌రా నుంచి కాజీగుండ్ వరకు ఏర్పాటైన కొత్త రైల్వే మార్గంలో నిర్మించిన చినాబ్ వంతెనపై ఒక ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయాణించింది.
ఈ రైలు ప్రత్యేక భద్రతా బలగాలను తీసుకెళ్లింది. భద్రతా పరంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్ల మధ్య ఈ రైలు ప్రయాణాన్ని పూర్తి చేసింది.
ప్రస్తుతం భారత్-పాక్ సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ రైలు సేవలు ప్రారంభమవడం చాలా కీలక పరిణామంగా భావించబడుతోంది.
ఇది కశ్మీర్ ప్రాంతానికి మిగిలిన దేశంతో కనెక్టివిటీ పెరిగేలా చేయనుంది.
వివరాలు
ట్రైల్ రన్‌ను ధృవీకరించిన నార్తర్న్ రైల్వే ప్రధాన ప్రజాసంబంధాల అధికారి
కశ్మీర్ రీజన్‌కు రైలు ప్రయాణాలను అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్నిసరిహద్దులలో తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం అడ్డుకోలేదని ఈ విజయవంతమైన రౌండ్ ట్రిప్ స్పష్టం చేస్తోంది.
ఈ మార్గంలో అదనంగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన ట్రైల్ రన్‌ను నార్తర్న్ రైల్వే ప్రధాన ప్రజాసంబంధాల అధికారి హిమాన్షూ శేఖర్ ఉపాధ్యాయ్ అధికారికంగా ధ్రువీకరించారు.
ఈ రైలు మార్గంలో కీలకమైన చినాబ్ వంతెన,కశ్మీర్‌ను రైల్వే ద్వారా దేశంతో ముడిపెడుతున్న కీలకమైన లింక్‌గా నిలుస్తోంది.
ఈ ప్రత్యేక రైలు కట్‌రా నుంచి ఉదయం 10గంటలకు బయలుదేరి,రాత్రి 6గంటలకు తిరిగి అక్కడికే చేరుకుంది.
వాస్తవంగా ఈ మార్గాన్ని గత నెలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేయాల్సి వచ్చింది.
వివరాలు
రైలు ప్రయాణమే ఒక్కటే మార్గం
తాజాగా ప్రయాణించిన ఈ ప్రత్యేక రైలులో సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరుతున్న సైనికులు ఉన్నారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌కు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో, ఆ సైనికులకు ఈ రైలు ప్రయాణమే ఒక్కటే మార్గంగా మారింది.
ప్రస్తుతానికి ఈ రైలు కట్‌రా నుండి కాజీగుండ్ వరకే నడుస్తోంది. సాధారణ రూట్ అయిన బారాముల్లా-కాజీగుండ్ మార్గం కంటే ఇది పరిమితమైనదే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉపయుక్తంగా మారుతోంది.
భవిష్యత్తులో కశ్మీర్ ప్రాంతానికి సైనికులు, ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఈ మార్గం కీలకంగా మారనుంది.
ఇప్పటికే ఉన్న రోడ్డు మార్గాలకు ఇది ఒక అదనపు మద్దతుగా ఉండనుంది.
ఇది భద్రతా పరంగా, ప్రయాణ సౌలభ్యం పరంగా కశ్మీర్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చే మార్గంగా భావించవచ్చు.