జయజయహే వారాహి.. వాహనంతో ప్రజల్లోకి రానున్న జనసేనాని
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉన్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా మళ్లీ జనం బాట పట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెంచేందుకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వారాహి పేరిట ఓ ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఆ వాహనాన్ని బయటికి తీయలేదు. ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వారాహిని బయటికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల వేళ వారాహి జోరు
త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ వారాహి వాహనంతో ప్రజల్లోకి తరలిరానున్నారు. వాహనంతో జనాల్లోకి రంగప్రవేశం చేసేందుకు సరైన సమయం వచ్చిందని పార్టీ స్ట్రాటజిస్టులు లెక్కలు వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ యాత్రపై పొలిటికల్ అడ్వజరీ కమిటీ సభ్యులతో ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. దీనికి రూట్ మ్యాప్, సర్కార్ వైఫల్యాలను ఏపీ జనంలోకి తీసుకెళ్లడంపై సమాలోచనలు జరిపారు. వారాహి యాత్రకు ఆటంకాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేశాక తేదీలు ప్రకటిస్తామని పీఏసీ ఛైర్ పర్సన్ స్పష్టం చేశారు.