Page Loader
దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు
దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు

దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు

వ్రాసిన వారు Stalin
Mar 11, 2023
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. జపాన్ యువతికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి పోలీసులు లేఖ రాశారు. ఆమె వివరాలను సేకరించారు. ఆ యువతి జపాన్ నుంచి వచ్చిన పర్యాటకురాలని, ఆమె దిల్లీలోని పహర్‌గంజ్‌లో బస చేసిందని, హోలీ వేడుకలు పూర్తయ్యాక, బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

దిల్లీ

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం

జపాన్ యువతిని వేధించిన బాలుడితో సహా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. మరింత సమచారాన్ని తెలుసుకోవడానికి వీడియోను విశ్లేషిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. పట్టుబడిన ముగ్గురు పహర్‌గంజ్ సమీపంలోని నివాసితులని చెప్పారు. ఈ వీడియోను పరిశీలించి నేరస్తులను అరెస్టు చేయాలని దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ వీడియోపై పరిశీలించింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.