Jayalalitha:జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత !
ఈ వార్తాకథనం ఏంటి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను బెంగళూరులోని కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి శుక్రవారం అప్పగించారు.
ఇప్పటివరకు ఈ ఆస్తులు, పత్రాలను బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో భద్రపరిచారు.
ఈ క్రమంలో, 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, విలువైన రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు వంటి వస్తువులను తరలించేందుకు అధికారులు భారీ భద్రత మధ్య ఆరు ట్రంక్ పెట్టెలను తెప్పించారు.
కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎన్ మోహన్ సమక్షంలో వీటిని అధికారులకు అప్పగించారు.
వివరాలు
ఆస్తుల విలువ రూ. 913.14 కోట్లు
జయలలిత అక్రమ ఆర్జన కేసు 2004లో తమిళనాడులోనుంచి కర్ణాటకకు బదిలీ చేయబడినప్పుడు, అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను బెంగళూరులో భద్రపరిచారు.
ఇకపోతే, తాము జయలలితకు చట్టపరమైన వారసులమని, ఆస్తులను తమకే అప్పగించాలని జె. దీపక్, జె. దీప అనే ఇద్దరు వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే, కర్ణాటక హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించగా, దాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కానీ, సర్వోన్నత న్యాయస్థానం కూడా వారి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913.14 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
అయితే, ప్రస్తుతం ఆ విలువ కనీసం రూ. 4,000 కోట్లుకి పెరిగి ఉండొచ్చని అనధికార సమాచారం వెల్లడిస్తోంది.