Page Loader
Krishnam Raju: కృష్ణంరాజు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల పట్ల ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు.. రిమాండు రిపోర్టులో పోలీసులు వెల్లడి
కృష్ణంరాజు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల పట్ల ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు

Krishnam Raju: కృష్ణంరాజు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల పట్ల ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు.. రిమాండు రిపోర్టులో పోలీసులు వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో 'అమరావతి వేశ్యల రాజధాని' అంటూ చేసిన హేయమైన వ్యాఖ్యలపై పాత్రికేయుడు వీవీఆర్‌ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు, ఈ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఆయనకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని, భాధ కూడా కనిపించలేదని న్యాయస్థానానికి తెలియజేశారు. అమరావతి ప్రాంతానికి చెందిన మహిళల పట్ల తీవ్ర అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడిన కృష్ణంరాజు, క్షమాపణ కోరడం కాకుండా, తన వ్యాఖ్యలపై తప్పు ఏమీ లేదంటూ వాటిని సమర్థించుకుంటూ వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెట్టినట్లు పోలీసులు న్యాయమూర్తులకు తెలిపారు.

వివరాలు 

దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరచాలనే ఉద్దేశ్యం 

అమరావతిలో వివిధ మతాలు, కులాలు, వర్గాల ప్రజలు నివసిస్తారని తెలిసిన వ్యక్తిగా కృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు కావాలనే చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇది అన్ని వర్గాల మహిళలని అవమానించడమే కాకుండా, ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరచాలనేది అతని ఉద్దేశమని వివరించారు. అతడి వ్యాఖ్యలను చూస్తే, అమరావతి ప్రాంతంలో నివసిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల న్యాయమూర్తులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఇతర ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు వంటి ప్రతిష్ఠాత్మక స్థానాల్లో ఉన్నవారిని కూడా ఆయన బహిరంగంగా అవమానించారని పోలీసులు అన్నారు. సీనియర్ పాత్రికేయుడిగా ఉన్నప్పటికీ, కృష్ణంరాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించదగినది కాదని వారు న్యాయస్థానానికి వివరించారు.

వివరాలు 

కోర్టుకు రిమాండు నివేదిక

కృష్ణంరాజును మంగళగిరిలోని అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్ క్లాస్‌ మేజిస్ట్రేట్‌, సివిల్‌ జడ్జి కోర్టుకు హాజరుపరిచిన తుళ్లూరు పోలీసులు, ఆయన వ్యాఖ్యల వెనక దాగిన కుట్ర, ఇందులో అతని పాత్ర, ఇతనికి మద్దతుగా నిలిచిన శక్తుల గురించి ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను చర్చిస్తూ, కోర్టుకు రిమాండు నివేదికను సమర్పించారు.