ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం, సీఎం జగన్ హాజరు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. 1983లో న్యాయశాస్త్ర పట్టా పొందిన తర్వాత న్యాయవాద వృత్తిలో ప్రవేశించి 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేసి 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
నూతన గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం జగన్
జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రమే ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో జస్టిస్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ నజీర్ ట్రిపుల్ తలాక్ కేసు, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం కేసు, నోట్ల రద్దు కేసు లాంటి సంచలన తీర్పులు ఇచ్చిన ధర్మాసననాల్లో జస్టిస్ నజీర్ సభ్యులు. ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు.