రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో భారతిని నిలబెట్టేందుకు పులివెందులతో సమానంగా జమ్మలమడుగులో వైసీపీని పటిష్టం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే సీఎం జగన్ జమ్మలమడుగు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారినట్లు కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన కడప జిల్లా పర్యటనలో కూడా జమ్మలమడుగుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులను సాధ్యమైనంత వరకు జమ్మలమడుగులోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటురున్నారు.
మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్
కడప జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఉక్కు కర్మాగారాన్ని జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లికు తరలించి ఇటీవల సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గంలో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అభివృద్ధి పథకాలను పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని తన కుటుంబానికి కంచుకోటగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థికి గట్టి ప్రత్యర్థిగా భారతిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి వేరే నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.