
కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతలను రంగంలోకి దించుతోంది.
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుక్రవారం బీదర్‌లో రోడ్‌షో నిర్వహించడం, మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటకలో బీజేపీ నాయకులతో సమావేశం కావడం చూస్తుంటే, రాష్ట్రంపై కమలనాథులు ఎంత ఫోకస్ పెట్టారో స్పష్టమవుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మూడు రోజులు పర్యటన నిమిత్తం శుక్రవారం కర్ణాటకకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు.
అలాగే శనివారం జరగనున్న పలు మీడియా కార్యక్రమాల్లోనూ అమిత్ షా, నడ్డాతో పాటు సీఎం బస్వరాజ్ బొమ్మై పాల్గొననున్నారు.
కర్ణాటక
ప్రధాని మోదీ ఛరిష్మాపై బీజేపీ నమ్మకం
కర్ణాటక ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో కొందరు కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు రెబెల్స్‌గా బరిలోకి దిగుతున్నారు.
ఈ పరిణామం బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే బీజేపీ మాత్రం మొదటి నుంచి ప్రధాని మోదీ ఛరిష్మాపైనే ఆధారపడుతోంది. బీజేపీని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోదీ ఒక్కరు చాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
బీజేపీ ప్రచారం కూడా ప్రధాని మోదీ సెంట్రిక్ గానే జరుగుతోంది. ఎక్కడ సభ పెట్టినా రాష్ట్ర నాయకులకంటే మోదీనే ఎక్కువ ప్రొజెక్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
బీజేపీ
ఒక వైపు ప్రచారం చేస్తూనే అసంతృప్తుల బుజ్జగింపు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకకు వచ్చిన అమిత్ షా, నడ్డా రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలను కూడా పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఒకవైపు ప్రచారం చేస్తూనే, టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు.
సీనియర్ నేత మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
శివమొగ్గ నియోజకవర్గంలో కేఎస్ ఈశ్వరప్పకు బలమైన క్యాడర్ ఉంది. రాష్ట్రంలో ఆయనకు అనుచర వర్గం కూడా గొప్పగానే ఉంది.
దీంతో కేఎస్ ఈశ్వరప్పను సంతృప్తి పరిచేందుకు నడ్డా, అమిత్ షా రంగంలో దిగినట్లు సమాచారం.
వీరి చొరవతోనే ప్రధాని మోదీ ఈశ్వరప్పతో మాట్లాడారు. స్వయంగా మోదీనే ఫోన్ చేయడంతో ఈశ్వరప్ప కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.