
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. విరాట్ కోహ్లీ వీడియో ప్రస్తావన
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అనుమతి లేకుండానే ఆర్సీబీ (RCB) తమ అభిమానులను ఆహ్వానించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ నివేదికలో విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రస్తావించిందని తెలిసింది.
వివరాలు
అనుమతుల కోసం విధివిధానాల ప్రకారం అప్లికేషన్ ఇవ్వలేదు
ఈ ఘటనకు సంబంధించిన నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే, హైకోర్టు దీనిని తిరస్కరించింది. ఈ నివేదికను రహస్యంగా ఉంచేందుకు చట్టపరంగా ఎలాంటి కారణాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం... 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ విజయం సాధించిన తర్వాత జూన్ 3న ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను సంప్రదించింది. విజయోత్సవ పరేడ్ నిర్వహించనున్నట్లు సమాచారం ఇచ్చినా, అనుమతుల కోసం విధివిధానాల ప్రకారం అప్లికేషన్ ఇవ్వలేదు. ఈ తరహా కార్యక్రమాలకు కనీసం ఏడు రోజుల ముందు నుంచే అనుమతులు తీసుకోవాలని నిబంధనలు చెప్పినా, ఆర్సీబీ యాజమాన్యం అవన్నీ లెక్కచేయలేదు.
వివరాలు
పాల్గొనాలంటూ అభిమానులకు ఆహ్వానం
అదే రోజున కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(KSCA)అనుమతుల కోసం చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించినట్టు నివేదికలో పేర్కొన్నారు. కారణం..ఆర్సీబీ జట్టు గెలుస్తుందో లేదో చివరి వరకు స్పష్టత లేకపోవడం, గెలిచిన తర్వాత నిర్వహించే వేడుకలకు ఎన్ని వేల మంది వస్తారో గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోవడమే. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అనుమతులు మంజూరు చేయలేదు. అయినప్పటికీ, విజయం తర్వాత ఆర్సీబీ యాజమాన్యం అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది. ఆ తరువాత మరొక పోస్టులో విరాట్ కోహ్లీ వీడియోను షేర్ చేసి , బెంగళూరు ప్రజలతో కలిసి ఈ విజయాన్ని జరుపుకోవాలని తన కోరికను తెలిపారు.
వివరాలు
స్టేడియం చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం వరకు అభిమానులు
ఈ నేపథ్యంలో స్టేడియం సామర్థ్యాన్ని మించిపోయేలా.. దాదాపు 3 లక్షల మంది ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేడియం చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం వరకు అభిమానులు గుమిగూడారు. పరిస్థితి తీవ్రంగా మారుతుందన్న అనుమానంతో పోలీసు విభాగం పెద్ద సంఖ్యలో సిబ్బందిని స్టేడియం పరిసరాల్లో మోహరించాల్సి వచ్చింది. అయితే నిర్వాహకులకు సరైన ప్రణాళికలు లేకపోవడం, ముందస్తుగా పోలీసులకు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడంలో విఫలమైన కారణంగా తొక్కిసలాట జరిగింది.
వివరాలు
గేట్లు తెరిచే సమయంలో తొక్కిసలాట
ప్రజలు భారీగా గుమిగూడిన తర్వాత స్టేడియంలోకి ప్రవేశించేందుకు ఎంట్రీ పాసులు కావాలని నిర్వాహకులు ఎక్స్‌లో మరో పోస్టు పెట్టారు. దాంతో అప్పటికే అక్కడికి చేరుకున్న వారు గందరగోళానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో గేట్లు తెరిచే సమయంలో తొక్కిసలాట జరిగింది. మరోవైపు 1, 2, 21 గేట్ల వద్ద ప్రజలు బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని ఉద్రిక్తతలు తప్పించారు. ఈ క్రమంలో వేడుకను రద్దు చేయాల్సిఉన్నా, కార్యక్రమాన్ని మాత్రమే కుదించారు.