
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నోటీసులు పంపించారు. ఇటీవల రాహుల్ గాంధీ, దేశంలోని ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనే, కర్ణాటకలో ఓ మహిళా ఓటరు రెండుసార్లు ఓటు వేశారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఈవో, ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు సమర్పించాల్సిందిగా రాహుల్ గాంధీకి సూచించారు. అంతేకాకుండా, ఎన్నికల సంఘం కూడా రాహుల్‌ను ఉద్దేశించి, ఓటు మోసంపై చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని లేదా తప్పుడు ఆరోపణలైతే ప్రజల ముందు దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి కోరింది.
వివరాలు
తమ విచారణలో సుకున్ రాణి అనే మహిళ ఒక్కసారే ఓటు వేశారన్న సీఈవో
రాహుల్ గాంధీ ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చూపించిన పత్రాలు, ఎన్నికల సంఘం రికార్డుల నుంచే సేకరించినవని ఆయన పేర్కొన్నారు. అలాగే పోలింగ్ అధికారుల రికార్డుల ప్రకారం "సుకున్ రాణి" అనే మహిళ రెండు సార్లు ఓటు వేసిందని ఆరోపించారు. కానీ, కర్ణాటక సీఈవో వివరణ ప్రకారం, వారి విచారణలో ఆ మహిళ ఒక్కసారి మాత్రమే ఓటు వేసినట్లు తేలిందని తెలిపారు. అంతేకాక, రాహుల్ ప్రజెంటేషన్‌లో చూపిన 'టిక్ మార్క్' పత్రాలు పోలింగ్ అధికారులుజారీ చేసినవి కావని వెల్లడైందన్నారు అందువల్ల, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపడానికి సంబంధిత ఆధారాలను అందించాలని నోటీసులో రాహుల్ గాంధీకి స్పష్టంగా తెలియజేశారని సీఈవో పేర్కొన్నారు.