కర్ణాటకలో బీభత్సంగా మద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్
కర్ణాటకలో మద్యం ధరల మోత మోగనుంది. విస్కీ, రమ్ము, జిన్, రెడ్ వైన్ సహా బీర్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు ధరల సవరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రతిపాదించారు. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం, అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఏఈడీ) పెంచాలని ప్రతిపాదనలు చేశారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై కొనసాగుతున్న డ్యూటీ రేట్లను సవరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మొత్తం 18 శ్లాబ్‌లపై 20 శాతం పన్నును అదనంగా విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బీరుపైనా 10 శాతం సుంకాన్ని అడిషనల్ గా విధించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే కన్నడనాట లిక్కర్ ధరలు అందనంత దూరం పెరగనున్నాయి.
కర్ణాటక రాష్ట్ర శాసనసభలో సీఎం సిద్ధరామయ్య రికార్డు
ధరల సవరణలో భాగంగా బీరు ధరలు 10 శాతం మిగతా లిక్కర్ ధరలు 20 శాతం మేర పెంచుతున్నారు. ఈ మేరకు బీర్లపై ఎక్సైజ్ సుంకాన్ని 175 నుంచి 185 శాతానికి పెంచుతున్నట్లు సీఎం తెలిపారు.ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ 3.35 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. ఇటీవలే మేనిఫెస్టోలో ఇచ్చిన 5 హామీలను అమలు చేసేందుకు ఇప్పటికే రూ.52 వేల కోట్లను కేటాయించామన్నారు. ఆయా ఎన్నికల హామీల అమలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 1.3 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర శాసనసభలో సీఎం సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించి మొత్తంగా 14వ సారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సాధించారు.