
Bengaluru: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు,గురువారం ఈ కేసుపై విచారణ జరిపింది. విచారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈఘటనలో ఏర్పాట్ల లోపాలపై ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలతో గట్టిగా నిలదీసింది. వేల సంఖ్యలో అభిమానులు హాజరవుతారని ముందే తెలిసిన పరిస్థితుల్లోనూ చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి అంబులెన్సుల ఏర్పాట్లు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కనీస సదుపాయాలు లేకుండా ఒక భారీ ఈవెంట్ నిర్వహించడం ఏంత మేరకు సమంజసమని ప్రశ్నించింది. ఈతొక్కిసలాట ఘటనపై పూర్తి వివరణను ఈనెల 10వతేదీలోపు సమర్పించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది.
వివరాలు
11 మంది దుర్మరణం
ఇదిలా ఉండగా, చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. అలాగే, 50 మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని అనేక ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు స్వయంగా బాధితులను ఆసుపత్రుల్లో పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం)ను ప్రకటించింది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, ఈ విషాద సంఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.