cricket Betting: క్రికెట్ బెట్టింగ్ తో కోటికిపైగా అప్పులు.. భార్య ఆత్మహత్య
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్న ఓ ఇంజనీర్ భార్య ఆత్మహత్యకి పాల్పడింది. తన భర్త డబ్బు అప్పుగా తీసుకున్నవారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె సూసైడ్ నోట్‌లో ఆరోపించింది. ఇప్పుడు సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు 13 మందిపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. 13 మందిలో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గలో జరిగింది. అక్కడ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న దర్శన్ బాలు అనే అసిస్టెంట్ ఇంజనీర్ త్వరగా ధనవంతుడు కావాలనే ప్రయత్నంలో క్రికెట్ బెట్టింగ్‌లో సుమారు రూ. 1.5 కోటి పోగొట్టుకున్నాడు.
13 మందిపై పోలీసు కేసు నమోదు
అప్పు తెచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు.అప్పు ఇచ్చినవారు అతని ఇంటికి వచ్చి అతని భార్యను వేధించడం ప్రారంభించారు. దీంతో విసిగిపోయిన దర్శన్ భార్య రంజిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త అప్పులు తీసుకున్న వ్యక్తులు తరచూ తమ ఇంటికి వచ్చి వేధించేవారని రంజిత సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో విసిగిపోయిన ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. బకాయిలు చెల్లించకుంటే మొత్తం కుటుంబం పరువు తీస్తామని రుణదాతలు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన రంజిత మార్చి 19న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇప్పుడు తన అల్లుడు దర్శన్ అప్పులు తీసుకున్న 13 మందిపై పోలీసు కేసు పెట్టాడు.
దర్శన్, రంజిత దంపతులకు రెండేళ్ల కుమారుడు
ఫిర్యాదు ఆధారంగా 13 మంది అనుమానితులపై ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. 13 మంది నిందితుల్లో ముగ్గురిని (శివు, గిరీష్, వెంకటేష్)అరెస్టు చేయగా,మిగిలిన వారు పరారీలో ఉన్నారు. దర్శన్, రంజిత దంపతులకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ దాదాపుగా రూ. 1.5 కోట్లకు పైగా రుణం తీసుకున్నాడని, అందులో రూ. 1 కోటి అప్పు తీర్చగా.. మరో రూ.54 లక్షల రుణం పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే,దర్శన్ నిర్దోషి అని మామగారు తన ఫిర్యాదులోతెలిపారు. దర్శన్‌కు బెట్టింగ్‌పై ఆసక్తి లేదని, అయితే అప్పుల వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా తనను ఎర వేసి ఈ ఉచ్చులోకి నెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.