Kasani Gnaneshwar : ఇవాళ గూలాబీ గూటికి చేరనున్న కాసాని.. గోషామహల్ బరిలో మాజీ టీడీపీ చీఫ్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీ.టీడీపీని బరిలో నిలపాలని భావించి భంగపడ్డ కాసాని జ్ఞానేశ్వర్, ఇప్పుడు అదే పార్టీలో చేరనున్నారు. తెలంగాణలో పోటీ వద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తేల్చి చెప్పడంతో భవిష్యత్ కార్యాచరణ మేరకు కాసాని ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఉదయం 11.30 గంటలకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే కాసానిని గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గోషామహల్ బరిలోేేేేేేేేేేేేేేే ముదిరాజ్ నేతలు
ముదిరాజ్ సామాజికవర్గానికి అధికార బీఆర్ఎస్ ఒక్క స్థానంలోనూ టిక్కెట్ కేటాయించ లేదన్న అపవాదు ఉంది. దాదాపు 50 లక్షల ఓట్లు ఉన్న తమ వర్గాన్ని బీఆర్ఎస్ లెక్క చేయట్లేదని ముదిరాజులు రాష్ట్రమంతటా సభలు సమావేశాల ద్వారా నిరసన చేపట్టారు. అయితే గతంలో ముదిరాజ్ సంఘానికి పెద్ద దిక్కుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాక గులాబీ దళానికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. రాజకీయ కారణాలతో ఇప్పటివరకు గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు. దీంతో కాసానికి లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు గోషామహల్ నుంచి బీజీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బరిలో దిగనున్నారు.అటు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ముదిరాజ్ పోటీ చేయనుండటం గమనార్హం.