
Pahalgam Terror Attack: కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ ఘటనతో వణికిపోయిన పర్యటకులు వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు.
కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Details
పర్యాటకులకు అండగా నిలవాలి
ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. విమానాశ్రయంలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాం.
ఆహారం, నీరు అందించాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి.
3,337 మంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచాం. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించాం.
ఇప్పటికే అన్ని ఎయిర్‌లైన్లు టికెట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా పర్యటకులకు అండగా నిలవాలని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Details
పర్యటకులు వీడుతుంటే బాధగా ఉంది: ఒమర్ అబ్దుల్లా
మరోవైపు తాజా పరిణామాలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
కశ్మీర్ లోయ నుంచి అతిథులు వీడుతుంటే నా హృదయం ద్రవిస్తోంది. అయితే వారు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారనేది నేను అర్థం చేసుకోగలను.
పర్యటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కల్పించిన అదనపు విమానాలతో పాటు రోడ్డు మార్గంలోనూ ప్రయాణ సౌకర్యాలు కల్పించామని సీఎం వెల్లడించారు.
కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.