కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. దిల్లీ పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దిల్లీ అసెంబ్లీ, ఎన్నికైన ప్రభుత్వ శాసన అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు లేవని సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మానసం స్పష్టం చేసింది. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. భూమి, పబ్లిక్ ఆర్డర్, పోలీసు మినహా అన్ని అంశాలలో పరిపాలనా సేవలను దిల్లీ ప్రభుత్వం నియంత్రిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
జస్టిస్ భూషణ్ తీర్పుతో తాము ఏకీభవించబోం: సుప్రీంకోర్టు
దిల్లీ పాలన ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉందని, ఎల్‌జీ దిల్లీ ప్రభుత్వ సలహాకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిల్లీ ప్రభుత్వానికి అన్ని సేవలపై అధికారం లేదన్న జస్టిస్ భూషణ్ తీర్పుతో తాము ఏకీభవించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. పార్లమెంట్ చట్టం లేనప్పుడు దిల్లీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకునే అధికారాలను కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. 'సత్యమేవ జయతే' అంటూ ట్వీట్ చేశారు.