Page Loader
AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ
అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ

AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా మరో హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలో అద్దె ఇళ్లలో నివసించే వారికి ఉచిత విద్యుత్‌, నీటి సదుపాయాలను అందిస్తామని తెలిపారు. పూర్వాంచల్‌కు చెందిన అనేక మంది కౌలుదారులకు కూడా ఈ ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత పాఠశాలలు, ఆసుపత్రుల నుంచి లబ్ధి పొందుతున్నా, అద్దె ఇళ్లలో నివసించేవారు ఉచిత విద్యుత్‌, నీరు వంటి పథకాల లబ్ధికి దూరంగా ఉన్నారని ప్రజలు చెబుతున్నారని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆప్‌ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Details

ఆర్చకులకు నెలకు రూ.18వేలు

ఆప్‌ ఇప్పటికే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్‌, మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం, అర్చకులకు రూ.18,000 గౌరవ వేతనం వంటి హామీలను ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించడానికి ఉచితాలపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్‌ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత రేషన్‌ కిట్లు, నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.8,500, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి పథకాలను హామీగా ప్రకటించింది.

Details

రూ.500కే గ్యాస్ సిలిండర్ : బీజేపీ

బీజేపీ ఉచితాల నుంచి దూరంగా ఉండాలనుకున్నా, 'సంకల్ప పత్రం' పార్ట్‌-1లో పేద కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు, గర్భిణి మహిళలకు రూ.21,000 ఆర్థిక సాయం, 'మహిళా సమృద్ధి యోజన' కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం వంటి హామీలను ప్రకటించింది. ఇదిలా ఉండగా, 'అన్‌బ్రేకబుల్‌' డాక్యుమెంటరీ ప్రసారం వివాదానికి గురైంది. ఆప్‌ ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు పేర్కొంటూ ప్రసారాన్ని నిలిపివేశారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ, ఈ డాక్యుమెంటరీ ఎన్నికల ప్రచారంతో సంబంధం లేదని, బీజేపీ తన రాజకీయ చర్యలను బహిర్గతం చేస్తుందనే భయంతో దీనిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు.