ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. దిల్లీ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపించిన అక్రమాలపై దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణను నమోదు చేసిందని అధికారులు బుధవారం తెలిపారు. అక్రమాలకు సంబంధించిన అన్ని పత్రాలను అక్టోబర్ 3లోగా అందజేయాలని దిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను సీబీఐ ఆదేశించింది. దిల్లీ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన విచారణ అనంతరం వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ డైరెక్టర్‌కు మే నెలలో రాసిన ఐదు పేజీల లేఖ ఆధారంగా విచారణకు ఆదేశించారు.
కేజ్రీవాల్‌ను కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: ఆప్
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్‌ను కూడా హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ పరిణామంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ పార్టీ ని నాశనం చేసేందుకు బీజేపీ తన శక్తినంతా వినియోగించుకుంటోందని,అన్ని దర్యాప్తు సంస్థలను మోహరించడం ద్వారా బిజెపి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ఇప్పటివరకు బీజేపీ కేజ్రీవాల్‌పై 50కి పైగా కేసులు నమోదు చేశారు కానీ ఆ కేసుల ద్వారా ఏమి నిరూపించలేకపోయారని పార్టీ మండిపడింది.
రూ.45 కోట్లతో సుందరీకరణ పనులు
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ విషయమై ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద వివాదం చెలరేగింది. ఆరోపణల నేపథ్యంలో, ఎల్‌జీ సక్సేనా ఈ అంశంపై నివేదిక సమర్పించాలని, అవకతవకలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని, ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి నివేదికలో పునర్నిర్మాణంలో ప్రాథమిక అవకతవకలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చేసిన ఫిరాయింపులు/ఉల్లంఘనలను జరిగాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా, మేలో సక్సేనా, ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి లేఖ రాశారు.
సక్సేనా ఆరోపణులు
ఇంటీరియర్ డెకరేషన్ కు రూ.11.30 కోట్లు, స్టోన్ అండ్ మార్బుల్ ఫ్లోరింగ్ కు రూ.6.02 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అండ్ అప్లయెన్సెస్ కు రూ.2.58 కోట్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కు రూ.2.85 కోట్లు, రూ.1.41 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. వార్డ్‌రోబ్, యాక్సెసరీస్ ఫిట్టింగ్, వంటగది ఉపకరణాలపై రూ. 1.1 కోట్లు ఖర్చుపెట్టినట్లు సక్సేనా ఆరోపణులు చేశారు. అలాగే మంజూరైన రూ.9.99 కోట్లలో ప్రత్యేకంగా రూ.8.11 కోట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఖర్చు చేశారు.