Page Loader
Kerala: ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం
ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం

Kerala: ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక వ్యక్తి జీవ సమాధి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్థానికులు ఆ వ్యక్తి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా, పోలీసులు సమాధిని తవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ కుటుంబ సభ్యులు ఈ చర్యను అడ్డుకోవడంతో ఈ వివాదం హైకోర్టుకు చేరింది. హైకోర్టు తాజాగా సమాధిని తవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

గోపన్‌ స్వామి అలియాస్‌ మణ్యన్‌ జీవ సమాధి పోస్టర్లు

గోపన్‌ స్వామి అలియాస్‌ మణ్యన్‌ జీవ సమాధి అయ్యారని ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల పోస్టర్లు ప్రచురించారు. అయితే, అతన్ని నెయ్యటింకరలోని ఒక దేవాలయం సమీపంలో, ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టడం అనుమానాలకు దారితీసింది. గోపన్‌ స్వామి తనను సమాధి చేయాలని కోరాడని ఆయన కుమారులు సనందన్‌, రాజేశన్‌ చెబుతుండగా, ఈ ప్రకటన మిస్టరీగా మారింది. ఇది కేవలం ఒక ఆచారం కాదని, ఇందులో ఏదో మతలబు ఉందని స్థానికులతో పాటు మృతుడి బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

హైకోర్టు నుండి ఆదేశాలు

పోలీసులకు ఈ విషయాన్ని తెలిపిన తరువాత, వారు కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా సబ్‌ కలెక్టర్‌ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో సమాధిని తవ్వాలని ఆదేశించారు. కానీ, గోపన్‌ స్వామి భార్య, కుమారులు ఈ చర్యను అడ్డుకున్నారు. సమాధిని తవ్వడానికి వీల్లేదని వారు ఖచ్చితంగా అన్నారు. అయితే, స్థానికులు మాత్రం సమాధిని తవ్వి నిజాలు బయటకు తీయాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు న్యాయపరంగా ముందుకెళ్లి హైకోర్టు నుండి ఆదేశాలు పొందారు. హైకోర్టు ఉత్తర్వులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాలు 

బంధువులకు సమాచారం ఇవ్వకపోవడం అన్యాయం 

గోపన్‌ స్వామి చనిపోయిన తీరుపై అనుమానాలు ఉన్నాయని, కనీసం బంధువులకు సమాచారం ఇవ్వకపోవడం అన్యాయమని ఒక స్థానికుడు అభిప్రాయపడ్డారు. మృతుడు కంటి చూపు సరిగా లేకపోవడం, ఇలాంటి నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నాడని చెప్పడం నమ్మశక్యంగా లేదని అన్నారు. ఈ వివాదంతో రెండు సంవత్సరాలుగా ఇంట్లోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా జీవ సమాధి కోరుకోవడం అనుమానాస్పదంగా మారింది.