Kerala: కేరళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు.. పాలక్కాడ్‌లో రెడ్ అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాల స్థాయి అధికంగా గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
పాలక్కాడ్, మళప్పురం జిల్లాల్లోని త్రితళ, పొన్నణి ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లలో ఇది 11 పాయింట్లుగా నమోదైందని, ప్రజలు అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
బయటకు వెళ్లేటప్పుడు రక్షణ సామగ్రి
ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, మత్స్యకారులు, వాహనదారులు, పర్యాటకులు, చర్మ, కంటి సమస్యలతో బాధపడేవారు నేరుగా అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
బయటకు వెళ్లేటప్పుడు నూలు దుస్తులు, గొడుగులు, టోపీలు, కంటి అద్దాలు వంటి రక్షణ సామగ్రిని ఉపయోగించాలని ప్రజలకు హితవు పలికింది.