
Nipah virus: కేరళలో రెండో నిఫా వైరస్ మరణం.. ఆరు జిల్లాల్లో హై అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో నిఫా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా పాలక్కాడ్ జిల్లాలో రెండవ కేసు నమోదైంది. మన్నర్కాడ్ సమీపంలోని కుమారంపుత్తూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు. అతను పెరింతల్మన్నలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం (జూలై 13) మరణించాడు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు కేసులు వెలుగుచూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతుడితో,అతని పరిసరాలతో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ప్రారంభించారు.
వివరాలు
46 మందిలో నిఫా వైరస్ గుర్తింపు
ఇప్పటివరకు 46 మందిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. నిఫా వైరస్ మళ్లీ చాపకిందనీరులా వ్యాపించడాన్ని గుర్తించిన అధికారులు పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. నిఫా వైరస్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులను సూచించారు. కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఆసుపత్రిలో ప్రతిస్పందన బృందాలను వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
వివరాలు
ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు అధికారిక హెచ్చరికలు జారీ
పాలక్కాడ్ జిల్లాలో రెండో నిఫా కేసు నమోదవడంతో ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు అధికారిక హెచ్చరికలు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. జ్వరం, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), హైగ్రేడ్ జ్వరం వంటి నిఫా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు సమీపంలోని ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని వారు వైరస్ బారినపడ్డ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను ఆసుపత్రుల్లో చూడటానికి రావద్దని హెచ్చరించారు. ఒక్కో రోగికి ఒక్క అటెండర్‌ను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
వివరాలు
నిఫా వైరస్ సంకేతాలు, లక్షణాలు:
నిఫా వైరస్ ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మైకం, మగత వంటి నాడీ సంబంధిత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో 24-48 గంటల్లోనే కోమాకు దారితీయవచ్చు. నిఫా వైరస్ సోకిన వారికి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. మెదడు వాపుతో కూడిన ఎన్సెఫాలిటిస్ కూడా ఈ వైరస్ వల్ల కలగొచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో అధిక జ్వరం, గందరగోళం, మూర్ఛ వంటి సమస్యలు వచ్చి చివరికి మరణానికి దారితీయవచ్చు.