Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళకు ఏడు రోజులు ముందే హెచ్చరికలు జారీ చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కన్నారు. హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బుధవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. మొదటగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ ముప్పు గురించి జూలై 23న అప్రమత్తం చేశామని, భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపామని ఆయన వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం అండగా ఉంటుంది
ప్రకృతి వైపరీత్యాల గురించి ఏడు రోజుల ముందే చెప్పే వ్యవస్థ భారత్ లో ఉంది. ఇటువంటి సాంకేతికత ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని ఉంటే ప్రాణనష్టం తగ్గేది. వయనాడ్ విషాదాన్ని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వంతో పాటు మోదీ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని అమిత్ షా వివరించారు. కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే మృతుల సంఖ్య 184కి చేరుకుంది. 225 మంది గల్లంతయ్యారు. సుమారు 7,000 మందిని 50 సహాయక శిబిరాల్లో ఉంచారు.