అమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దు
ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా పడింది.గుజరాత్ లో బిపోర్‌జాయ్ తుపాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో బీజేపీ సభ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉండగా రాజకీయ సభలు వద్దు అనే సదుద్దేశంతోనే షా ఖమ్మం టూర్ తాత్కాలికంగా రద్దైనట్లు బండి సంజయ్ వివరించారు.
చివరి క్షణంలో అమిత్ షా టూర్ రద్దు
మరోవైపు తుపాను తీవ్రరూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగంతో నిరంతం సహాయక చర్యలను అమిత్ షా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ షెడ్యూల్డ్ టూర్ వాయిదా పడింది. అయితే తెలంగాణ పర్యటనలో భాగంగా 4 రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం షెడ్యూల్డ్ లో భాగంగానే ఉంది. దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ తోనూ షా భేటీ కావాల్సి ఉంది. ముందస్తు నిర్ణయించిన షెడ్యూల్డ్ ప్రకారం షా బుధవారం అర్ధరాత్రికే హైదరాబాద్ రావాల్సి ఉండగా, పర్యటన రద్దుతో ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా మంచిర్యాల టూర్ సహా సంగారెడ్డిలో మేధావులతో అమిత్ షా సమావేశం ఆకస్మికంగా రద్దు కావడం గమనార్హం.