రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తున్న నిరసనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాలను ఖాప్ కమిటీ కమిటీ కలుస్తుందని రాకేష్ టికైత్ తెలిపారు. భూషణ్ సింగ్‌పై నమోదైన పోక్సో కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని టికాయిత్ ప్రశ్నించారు. మల్లయోధులు తమ పతకాలను గంగానదిలో వేయవద్దని టికాయిత్ కోరారు. మళ్లీ దిల్లీసరిహద్దులను దిగ్బంధిస్తామని, రెజ్లర్ల డిమాండ్లను నెరవేర్చకుంటే దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు శుక్రవారం కురుక్షేత్రలో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.