
Kodali Nani: కోల్కత్తా విమానాశ్రయంలో పోలీసుల అదుపులోకి కొడాలి నాని..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పోలీసులు తీసుకుంటున్న చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇప్పటికే మద్యం స్కాంలో భాగంగా పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు.
తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని, పోలీసులు ఆయనను విజయవాడకు తరలించారు.
ఇదే సమయంలో, మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కత్తా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో జారీ చేసిన లుకౌట్ నోటీసుల ఆధారంగా ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
వివరాలు
కొడాలిపై లుకౌట్ నోటీసులు జారీ
వైసీపీ ప్రభుత్వ కాలంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో, మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వంలో కేసులు నమోదయ్యాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తదనంతరం కొడాలి నాని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కొద్ది కాలంలోనే ఆయన అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది.
అక్కడ ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవుతూ ఉండగా, ఇటీవల ఆయన మళ్లీ వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు.
వివరాలు
కోల్కత్తా నుండి కొలంబోకు కొడాలి నాని
ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరైన కొడాలి నాని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇదే సమయంలో ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు మరలా చర్చకు వచ్చాయి.
తాజాగా, కోల్కత్తా నుండి కొలంబో ప్రయాణించే సమయంలో విమానాశ్రయంలో ఆయనను పోలీసులు నిలిపివేశారు.
ముందుగా జారీ చేసిన లుకౌట్ నోటీసుల మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులకు తెలియజేశారు.
దీంతో, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది.