Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది.
ఆయనపై కేసుల ముప్పు మరింత తీవ్రతరమవుతోంది. అధికారంలో ఉన్న సమయంలో వంశీ పాల్పడిన భూదందాలు, అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు వంశీపై తాజాగా మూడు కేసులు నమోదు చేశారు.
ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మరోసారి గన్నవరం పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.
ఆత్మకూరులో జరిగిన ఓ భూ వివాదంలో వంశీ అనుచరులు అతని సూచనల మేరకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినట్లు అయితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని బెదిరింపులకు గురి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివరాలు
ఆత్మకూరు పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
దీనిపై స్పందించిన ఆత్మకూరు పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇక భూమి అక్రమంగా కబ్జా చేశారని ఓ న్యాయవాది మంగళవారం గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు, గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అనధికారికంగా మైనింగ్ తవ్వకాలు నిర్వహించారని, దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు
ఈ నెల 13వ తేదీన వంశీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు.
రిమాండ్ గడువు ముగియడంతో, నిందితులను జైలు నుంచే వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
వాదనలు విన్న న్యాయస్థానం వల్లభనేని వంశీతో పాటు మిగిలిన ఇద్దరు నిందితులకు వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.