LOADING...
#NewsBytesExplainer: నీటిపై  తెలంగాణ నేత‌ల‌ రాజకీయాలు.. వాడకంలోనూ కేటాయింపుల్లోనూ ద్రోహమే!
నీటిపై తెలంగాణ నేత‌ల‌ రాజకీయాలు.. వాడకంలోనూ కేటాయింపుల్లోనూ ద్రోహమే!

#NewsBytesExplainer: నీటిపై  తెలంగాణ నేత‌ల‌ రాజకీయాలు.. వాడకంలోనూ కేటాయింపుల్లోనూ ద్రోహమే!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ, గోదావరి జలాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, అధికార కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ రెండు పార్టీల నీటి మీద ప్రేమ నిజమేనా? ఇప్పుడు జరుగుతున్నదే నిజమైన అన్యాయమా? ఈ విషయంలో వాస్తవంగా ఎవరి పాత్ర ఎంత ఉన్నదీ తెలుసుకోవాలంటే, కృష్ణా ప్రాజెక్టుల కింద నిజంగా ఏం జరుగుతోంది అనే లెక్కలు చూస్తే తప్ప స్పష్టత రాదని సాగునీటి రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

ఈ గణాంకాలే ఇప్పటి రాజకీయ దుమారం వెనుక ఉన్న మౌలిక వాస్తవాలు

నిజమే, కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది నిపుణులే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేటాయింపులు అప్పటికే ఆ రాష్ట్రాలు వినియోగిస్తున్న నీటి ప్రాతిపదికన జరిగాయి. కృష్ణా నదిపై అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు, ఇక ఆంధ్ర ప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయించబడ్డాయి. ఇవి తుది కేటాయింపులు కాకపోయినా, ఈ గణాంకాలే ఇప్పటి రాజకీయ దుమారం వెనుక ఉన్న మౌలిక వాస్తవాలు.

వివరాలు 

కేటాయింపులైతే జరిగాయి... కానీ వినియోగం ఏంత వరకు? 

బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ అప్పట్లో కృష్ణా జలాల పంపిణీపై పని చేస్తుండగా,అదనంగా నీటిని సంపాదించాలంటే కొత్త ప్రాజెక్టులు పూర్తవాలి. కానీ తెలంగాణలో గత పదేళ్లలో ఏం జరిగింది?గతంలో కేటాయించిన 299 టీఎంసీల నీటిని ఏ సంవత్సరం పూర్తిగా వినియోగించలేదు. ఈ మొత్తాన్ని సద్వినియోగం చేస్తే రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అయితే మిగిలిన జిల్లాల్లో మొత్తం సాగుభూమి 41.6 లక్షల ఎకరాలుగా ఉండగా, ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం 32 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ప్రణాళిక ఉంది. వాస్తవంలో సాగునీరు అందుతున్న భూమి మాత్రం కేవలం 14 లక్షల ఎకరాలే. అదీ మంచిగా వర్షాలు వచ్చిన సంవత్సరాల్లో మాత్రమే. వర్షాభావ పరిస్థితుల్లో ఈ సంఖ్య 8 లక్షల ఎకరాలకు పడిపోతుంది.

వివరాలు 

అనుబంధ కాలువల నిర్మాణం—అవగాహన లోపమా, ప్రణాళికా లోపమా? 

ప్రధాన ప్రాజెక్టులు: నాగార్జున సాగర్ ఎడమకాలువ (100 టీఎంసీలు), వరదకాలువ, ఏఎంఆర్‌పీ (30), బీమా (20), కల్వకుర్తి (30), నెట్టెంపాడు (20), పాలమూరు-రంగారెడ్డి (90), కోయిల్ సాగర్, మూసీ ఇలా అన్నీ కలిపి సాగునీరు అందించాల్సిన లక్ష్యం ఉన్నా, కొన్ని ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు, మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి.

వివరాలు 

కృష్ణా నీటిని పూర్తిగా వినియోగించని గతం 

గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణ తన వాటా 299 టీఎంసీల నీటిని పూర్తిగా వాడుకోలేకపోయిందని ఇరిగేషన్ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.. తగినవిధంగా ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం.ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పక్కాగా ప్రణాళికాబద్ధంగా సాగర్ కుడికాలువ,డెల్టా కాలువలు,ఎత్తిపోతల ద్వారా అధికంగా నీటిని వినియోగిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా 206 టీఎంసీలు,హంద్రీనీవా ద్వారా 30 టీఎంసీలు,తుంగభద్ర నుండి మరో 60 టీఎంసీలు తీసుకున్నారు. 2024-25లో తెలంగాణ వినియోగించిన నీరు 286 టీఎంసీలైతే,ఆంధ్ర ప్రదేశ్ మాత్రం 718 టీఎంసీల నీటిని వినియోగించింది. గత పదేళ్లలో ఇది గరిష్ఠంగా ఉంది.మరి ఈ పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎలా సమర్థించుకోగలదు? ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ స్పందన మౌలికంగా మారాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

వివరాలు 

ఆంధ్ర ప్రదేశ్ మళ్లీ ముందంజలో—ఎత్తిపోతల సామర్థ్యం పెంపు 

జగన్ ప్రారంభించి, దాదాపు పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 90,800 క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం ఏర్పడింది. అంటే నెల రోజుల్లో 240 టీఎంసీల నీటిని తరలించగలదన్నమాట. ఇప్పటికే శ్రీశైలం కుడికాలువ (11,500 క్యూసెక్కులు), వైఎస్సార్ కాలువ (44,600 క్యూసెక్కులు), తాజా రాయలసీమ కాలువ (34,700 క్యూసెక్కులు) ఇలా పెద్ద ఎత్తున ప్రణాళికలు పూర్తయ్యాయి. ఇక చంద్రబాబు తాజాగా గోదావరి నీటిని బనకచర్లకు తీసుకురావడానికి కొత్త ప్రాజెక్టును చేపట్టారు.

వివరాలు 

ఘోరంగా పిల్లకాలువల పరిస్థితి 

ఈ పెద్ద ప్రాజెక్టులపై ప్రేమ ఉండే నాయకులు, పిల్లకాలువల నిర్మాణంపై మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. భారీ బడ్జెట్, పెద్ద కాంట్రాక్టులు మాత్రమే ప్రాధాన్యత. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసే చిన్న ప‌నులు ఎవరి దృష్టికీ రాకుండా పోతున్నాయి. దీని వల్ల రైతులు మాత్రం నీటి కోసం తపస్సు చేస్తున్నట్లు ఎదురుచూస్తున్నారు.

వివరాలు 

తెలంగాణ వాడిన కృష్ణా నీటి లెక్కలు 

తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీటిని 2014 ఒప్పందం ప్రకారం వాడుకోవాల్సి ఉంది. కానీ వాడుతున్నదా అన్నది ప్రశ్న. 50:50 నిష్పత్తిలో నీరు కావాలన్న ప్రతిపాదన చేసినా, నాణ్యమైన విభజనకే అవసరమైన ప్రాజెక్టులు పూర్తవ్వలేదు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఇంకా పూర్తి కాలేదు. ఉదయసముద్రం పూర్తిగా నిండే పరిస్థితి లేదు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు ప్రాజెక్టుల్లో పిల్లకాలువల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

వివరాలు 

కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యం 

కృష్ణా ప్రాజెక్టులపై అప్పటి సీఎం కేసీఆర్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎస్ఎల్‌బీసీని పట్టించుకోలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపులు జరిగినా నిధులు ఇవ్వలేదు. ట్రిబ్యునల్ తుది ఆదేశాల ముందు ప్రాజెక్టులు పూర్తైతే రాష్ట్రానికి మేలు జరిగేదని నిపుణులు అంటున్నారు. కానీ ఆ అవకాశం వదిలేసి ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌పై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నారు.

వివరాలు 

సంవత్సరం తెలంగాణ వాడుకున్న నీళ్లు (టీఎంసీ)   ఆంధ్రప్రదేశ్ వాడుకున్న నీళ్లు (టీఎంసీ) 

సంవత్సరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2014-15 227.743 529.330 2015-16 69.688 124.960 2016-17 153.386 282.512 2017-18 183.298 359.897 2018-19 207.298 504.476 2019-20 278.234 653.064 2020-21 253.234 618.935 2021-22 265.051 621.841 2022-23 273.300 637.996 2023-24 120 210 2024-25 286 718