
Eknath Shinde: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై కమెడియన్ వివాస్పద వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై హాస్యనటుడు కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనాన్ని రేపుతున్నాయి.
షిండేను ఉద్దేశించి దేశద్రోహిగా అభివర్ణించిన కమ్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు కునాల్ కమ్రా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
అంతేకాకుండా, కునాల్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడులు కూడా చేశారు. కునాల్‌ను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.
వివరాలు
కునాల్ స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరిక
శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు.
కునాల్‌ను "కాంట్రాక్ట్ కమెడియన్"గా అభివర్ణించిన మ్హాస్కే, అతను డబ్బుల కోసమే తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.
మహారాష్ట్రలోనే కాకుండా, దేశంలో ఎక్కడైనా కునాల్ స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరించారు. శివసేన కార్యకర్తలు అతన్ని నిరంతరం వెంబడిస్తారని గట్టి హెచ్చరికలు చేశారు.
వివరాలు
శివసేన కార్యకర్తల హింసాత్మక చర్యలను ఖండించిన ఆదిత్య ఠాక్రే
ఇక శివసేన కార్యకర్తల హింసాత్మక చర్యలను శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శివసేన కార్యకర్తలు సృష్టించిన విధ్వంస దృశ్యాలను శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మహారాష్ట్రకు ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని విమర్శించారు.
కునాల్ మహారాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్య పాట రాశారని, దానికి ప్రతిస్పందనగా షిండే అభిమానులు అతని ఆస్తులపై దాడులు చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.