Page Loader
LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 
L K Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు

LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. భారత సమాకాలిన రాజకీయాల్లో అద్వానీ లాంటి నాయకులు ఉండటం చాలా అరుదు. ఆధునిక పొలిటికల్ సిస్టమ్‌లో 'అవినీతి మరక' అనేది ఒక స్టేటస్‌గా భావిస్తున్న నేటి రాజకీయ నాయకులకు అద్వానీ ఆదర్శ జీవితం ఒక పాఠం అని చెప్పాలి. ఒకదశలో అద్వానీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీలకు ఆ ఆరోపణలు ఆయుధంగా మారాయి. కానీ ఆయన తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేశారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, క్లీన్ చీట్ వచ్చే వరకు లోక్‌సభలోకి రాబోనని ప్రకటించి.. సంచలనానికి కేంద్ర బింధువు అయ్యారు.

అద్వానీ

హవాలా కేసులో అద్వానీపై సీబీఐ అభియోగాలు

1993 నుంచి అద్వానీపై ఆరోపణలు మొదలయ్యాయి. హవాలా వ్యాపారి ఎస్కే జైన్ నుంచి లాల్ కృష్ణ అద్వానీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని అప్పట్లో పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో ఉన్న సుబ్రమణ్యస్వామి విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ కేసును సీబీఐ విచారణకు స్వీకరించింది. ఎస్కే జైన్ డైరీని సీబీఐ స్వాధీనం చేసుకొని.. పరిశీలించగా.. అందులో 55 మంది నేతలు, 15 మంది అధికారులు, ఇతరత్రా 92 మంది పేర్లు బయటపడ్డాయి. ఈ హవాలా కేసులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, శరద్ యాదవ్, విద్యా చరణ్ శుక్లా, ఎల్‌కే అద్వానీ పేర్లు కూడా ఉన్నాయి. లాల్ కృష్ణ అద్వానీ రూ.60 లక్షలు తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది.

అద్వానీ

ఇచ్చిన మాట ప్రకారం.. 1996 ఎన్నికల్లో పోటీ చేయని అద్వానీ 

1995లో ఎస్‌కే జైన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 1996 జనవరి 16న సీబీఐ కేసు చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఎల్‌కే అద్వానీ పేరు కూడా ఉంది. 1996లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనే సీబీఐ చార్జిషీటు దాఖలు చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు ఇది ఆయుధంగా మారింది. దీంతో అద్వానీ వెంటనే తన లోక్‌సభకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అటల్ బిహారీ వాజ్‌పేయికి మాత్రం అద్వానీ రాజీనామా చేయడం ఇష్టం లేదు. కానీ అద్వానీ వినలేదు. తనపై అవినీతి ఆరోపణల నుంచి బయటపడేంత వరకు సభలోకి అడుగు పెట్టబోనని రాజీనామా చేస్తూనే అద్వానీ ప్రకటించారు. ఈ క్రమంలోనే 1996 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు.

అద్వానీ

1997లో క్లీన్ చీట్.. 3లక్షల మెజార్టీతో విజయం 

8 ఏప్రిల్ 1997న హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ఎల్‌కె అద్వానీని నిర్దోషిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో అద్వానీని నిర్దోషిగా తేల్చింది. ఆ తర్వాత 1998లో గాంధీనగర్ నుంచి అద్వానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 3లక్షల మెజార్టీతో గెలిచి.. విజయగర్వంతో అవినీతి మరకను తొలగించుకొని.. లోక్‌సభలో సగర్వంగా అడుగుపెట్టారు. ఈ ఘటన అద్వానీ నిజాయితీకి అద్దం పడుతుంది. ఈ ఉదంతం దేశ ప్రజల పట్ల, రాజకీయాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్‌కు ఒక నిదర్శనం అని చెప్పాలి.