ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ
ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే లేఖ రాశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గౌతమ్ అదానీతో ప్రధాని మోదీకి సంబంధాలు ఉన్నాయనడాన్ని ఆయన తప్పుపట్టారు. రాహల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ప్రధానంగా ప్రధాని మోదీ, వ్యాపార వేత్త గౌతమ్ అదానీ మధ్య ఉన్న సంబంధంపై ఆయన సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలు: దూబే
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో ముందస్తు నోటీసు ఇవ్వకుండానే రాహుల్ గాంధీ ప్రధానికి వ్యతిరేకంగా కొన్ని ధృవీకరించబడని వ్యాఖ్యలు చేసినట్లు దూబే తన లేఖలో పేర్కొన్నారు. రాహల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి సభ గౌరవానికి భంగం కలిగించేవిగా ఉన్నాయన్నారు. ఇలా చేయడం అంటే సభను ధిక్కరించడమే అని దూబే స్పష్టం చేశారు. సభను ధిక్కరించినందుకు గాను రాహుల్ గాంధీపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఇదిలా ఉంటే, గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్‌ను కుదిపేస్తోంది.