Wayanad bypolls: వాయనాడ్‌లో రేపు లోక్‌సభ ఉప ఎన్నికలు .. సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం)పోలింగ్ జరగనుంది. నిన్న (సోమవారం)వయనాడ్ ఉప ఎన్నికల ప్రచారం ముగింపు రోజున మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. ప్రియాంకా గాంధీ తరుపున కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా,సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌లతో పాటు మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి మళ్లీ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. కానీ ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా గెలవడంతో, నియమాల ప్రకారం వయనాడ్ సీటును వదిలివేయాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
రాహుల్ సీటును వదులుకోవడం పట్ల లెఫ్ట్, బీజేపీ ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీని ఈ స్థానంలో పోటీకి దింపి సీటును కాపాడాలని చూస్తోంది. మరోవైపు సీపీఐ, బీజేపీ ఈ సీటును కాంగ్రెస్ నుంచి గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. 2019 నుంచి వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి అక్కడి ప్రజల మద్దతు ఉన్నదని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, రాహుల్ సీటును వదులుకోవడం పట్ల లెఫ్ట్, బీజేపీ ఆరోపణలు చేశారు. ప్రియాంక గాంధీ గెలిస్తే నియోజకవర్గానికి అందుబాటులో ఉండరని బీజేపీ విమర్శించింది. అయితే, ప్రియాంక గాంధీ క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని హామీ ఇచ్చారు.
మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), కల్పెట్ట (వయనాడ్ జిల్లా), తిరువంబాడి (కోజికోడ్ జిల్లా), ఎరనాడ్, నిలంబూర్, వండూర్ (మలప్పురం జిల్లా) ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సహా సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించారు. పోలింగ్ కోసం భద్రతా చర్యలు చేపట్టారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ప్రియాంకా గాంధీ నేపథ్యం..
ప్రియాంకా గాంధీ వాద్రా,మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఆమె 1972 జనవరి 12న జన్మించారు. మనస్తత్వ శాస్త్రంలో డిగ్రీ, బౌద్ధ అధ్యయనాలలో మాస్టర్స్ పూర్తిచేశారు. 2019లో ప్రియాంక ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాయ్‌బరేలీలో తన తల్లి స్థానంలో నిలబడతారని, లేదా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇటీవల ఆమె ఆస్తులు రూ.12 కోట్లు విలువ కలిగి ఉన్నట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రియాంకకు రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు, హోండా సీఆర్‌వీ కారు ఉన్నట్లు తెలిపారు. రాబర్ట్ వాద్రా ఆస్తులు కూడా ఆమె అఫిడవిట్‌లో ఉన్నాయి.
బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..
నవ్య హరిదాస్ 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో, బీజేపీలో చేరి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. నవ్యకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఆమెకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నట్లు, అప్పులు రూ.1,64,978 అని పేర్కొన్నారు.
సత్యన్ మొకేరి నేపథ్యం..
సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. నాదాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 1987 నుండి 2001 వరకు కేరళ శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీలో సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. రైతు సంఘాలతో అనుబంధం ఉన్న ఆయన వ్యవసాయ సమస్యల పట్ల కట్టుబాటు వయనాడ్ ఓటర్లను ఆకర్షించగలదని ఎల్‌డీఎఫ్ భావిస్తోంది.