Nara Lokesh: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, నైపుణ్య అభివృద్ధి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కోసం సాంకేతిక సహకారం అందించాలని లోకేశ్ సత్య నాదెళ్లను కోరారు. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కూడా ప్రతిపాదించారు. అంతేకాక,ఆంధ్రప్రదేశ్‌కి ఒకసారి రావాలని సత్య నాదెళ్లను లోకేశ్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్,ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ లీడర్‌గా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. 2023లో సంస్థ $211.9 బిలియన్ ఆదాయం ఆర్జించిందని,ఈ ఏడాది అక్టోబర్ నాటికి సంస్థ విలువ $3.1 ట్రిలియన్ మార్కెట్‌గా ఉందని చెప్పారు.
డేటా సెంటర్ల ఏర్పాటుతో మరింత పెట్టుబడుల కోసం అవకాశం
అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు. "రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులు స్థాపిస్తున్నాం. మైక్రోసాఫ్ట్ సహకారంతో ఈ ఐటీ హబ్‌లను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మాకు సహాయం అవసరం. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో మరింత పెట్టుబడుల కోసం అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి క్లౌడ్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు ఆసక్తి కలిగి ఉన్నాం. అగ్రిటెక్, ఏఐతో రాష్ట్రంలో సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనుకుంటున్నాం," అని వివరించారు.
అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
అంతేకాక, బిజినెస్ ప్రాజెక్టుల వేగవంతమైన అమలు కోసం అందుబాటులో మరిన్ని సేవలను తీసుకురావడం జరుగుతుందని, రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలను అందిస్తామని అన్నారు. "అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రత్యేక ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి," అని చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులు లోకేశ్‌తో ఫొటోలు దిగారు.