అటవీ సంరక్షణ సవరణ బిల్లు 2023కి లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి కీలక అడుగు పడింది. అటవీ పరిరక్షణ సవరణ బిల్లు (Forest Conservation Amendment Bill)కు లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీశాఖ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. తర్వాత ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను సదరు అటవీశాఖ మంత్రి సభకు వివరించారు. ఈ క్రమంలోనే బిల్లుపై సభలో స్వల్ప కాలం చర్చలు జరిగాయి. ఈ మేరకు అటవీ పరిరక్షణ సవరణ బిల్లు 2023కి దిగువసభ ఆమోదించింది. దేశ సరిహద్దుల్లో సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ ఏరియాలోని అటవుల్లో జూ కేంద్రాలు, సఫారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన చట్టానికి తాజాగా సవరణలు చేశారు.
100 కిలోమీటర్ల రేంజ్‌లో జాతీయ ప్రాముఖ్యత ప్రాజెక్టులకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం భారతదేశం సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. ఈ నిబంధనలను మార్చి అక్కడి అడవుల్లో జూలు, సఫారీలు, ఎకో టూరిజం సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు పాత చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం ప్రభుత్వం బిల్లు రూపొందించింది. అందులో భాగంగానే ఇవాళ పాత అటవీ సంరక్షణ చట్టాలను సవరిస్తూ, సరిహద్దు ఫారెస్ట్ ఏరియాలో కార్యకలాపాలు చేపట్టేందుకు దిగువసభలో కీలక ఆమోదం దక్కింది. అంతర్జాతీయ సరిహద్దు (INTERNATIONAL BOUNDARY), నియంత్రణ రేఖ (LOC), వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న అటవుల్లో జాతీయ ప్రాముఖ్యత ప్రాజెక్టులు నిర్మించేందుకు చట్టానికి సవరణలు చేపట్టారు. బిల్లు ఆమోదం పొందాక లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.