
AP Rains: ఏపీలో ఈ నెలలో వరుస అల్పపీడనాలు.. రాబోయే రెండు వారాల్లో వర్షాలకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలం నడుమ వేసవి వేడి, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నఏపీ ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనున్న సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుదనం సంతరించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో, దాని ప్రభావం శనివారం తర్వాత మరింత స్పష్టంగా కనిపించి, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బలపడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ విభాగం ప్రకారం, రాబోయే రెండు వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వివరాలు
ఈ నెల 13 నాటికి అల్పపీడనం
ఆగస్టు ప్రారంభం నుంచి రాష్ట్రంలో అధిక వేడి,ఉక్కపోత వాతావరణం కొనసాగింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రుతుపవనాల ప్రభావంతో మేఘావృత పరిస్థితులు ఏర్పడుతున్నందున, శుక్రవారం నుంచి ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సీజన్ చివరి వరకు రుతుపవనాల చురుకుదనం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా. తర్వాత మరిన్ని అల్పపీడనాలు ఏర్పడి, అవి తుపాన్లుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.
వివరాలు
ఏకధాటి వర్షాలు తక్కువే
రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటివరకు ఎక్కువ ప్రాంతాల్లో గణనీయమైన వర్షాలు కురియలేదు. జూన్, జూలై నెలల్లో అనేక ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ సమాచారం ప్రకారం, జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం రావాల్సి ఉండగా, వాస్తవంగా 215.6 మిల్లీమీటర్లే నమోదైంది. అయితే ఈ నెలలో విస్తృతంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని, గతంలా నిరంతర వర్షాల అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ సెప్టెంబరులో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు.
వివరాలు
వింజమూరులో అత్యధిక వర్షపాతం
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం, శనివారం, అలాగే మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. గురువారం నెల్లూరు, కోనసీమ, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, ప్రకాశం, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వీటిలో నెల్లూరు జిల్లా వింజమూరులో అత్యధికంగా 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.