Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, ముచ్చటగా మూడోసారి 'చాంపియన్స్' గా నిలిచింది.
ఈ ఘన విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు జరుపుకుంటోంది.
ప్రజలు పటాకులు కాల్చుతూ, విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా మోవ్ పట్టణంలో కొందరు యువకులు టీమ్‌ఇండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ పట్టణంలోని జామా మసీద్ వద్దకు చేరుకున్న సమయంలో, కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
వివరాలు
ఘటనపై దర్యాప్తు..బాధ్యులపై కఠిన చర్యలు
పరస్పరం రాళ్లు విసురుకోవడంతో పాటు,కొన్ని దుకాణాలు ధ్వంసం చేశారు.వాహనాలకు నిప్పు పెట్టారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి,ఇరువర్గాలను చెదరగొట్టారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఇండోర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ ఘర్షణల కారణంగా మోవ్ పట్టణంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయని ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ పేర్కొన్నారు.
టీమ్‌ఇండియా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
పటాకులు కాల్చడం వల్లే వివాదం మొదలైందని వివరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసత్య వార్తలను నమ్మరాదని సూచించారు.
పోలీసులు నిరంతర పహరా నిర్వహిస్తున్నారని,గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు పేర్కొన్నారు.