అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్ మంతనాలు.. అజిత్ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మలుపులు తీసుకుంటున్నాయి. పార్టీ నేతలు ఎప్పుడు ఏం చేయనున్నారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారోనని మరాఠ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అర్ధరాత్రి సమావేశమయ్యారు.
ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపైనా అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరికపైనా 2 గంటల వరకు మంతనాలు జరిపారు.
చీలిపోయిన ఎన్సీపీ వర్గంతో అధికారాన్ని పంచుకోవడం, కేబినెట్ విస్తరణపై షిండే, ఫడ్నవీస్ చాలా సేపు చర్చించినట్లు సమాచారం.
అయితే అజిత్ పవర్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై ఏక్‌నాథ్ షిండే వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
details
ఏక్‌నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకోవట్లేదు : శివసేన
ఈ క్రమంలోనే షిండే, ఫడ్నవీస్ అర్ధరాత్రి వేళ అత్యవసరంగా భేటీ అవడం కీలకంగా మారింది. ఇటీవలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగరేశాడు.
ఈ మేరకు అజిత్ తన వర్గంతో కలిసి ప్రభుత్వంలో చేరిపోయారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంగా నియమాకం అయ్యారు. దీంతో మహా ప్రభుత్వంలో ప్రస్తుతం ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉన్నారు.
మరో వైపు తమ పార్టీలో విభేదాలు ఏమీ లేవని షిండే వర్గం అంటోంది. ఏక్‌నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకోవట్లేదని ఆయన వర్గం స్పష్టం చేసింది.
మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ఆగస్ట్ 4 వరకు నిర్వహించనున్నారు.
details
బీఏసీలో పాల్గొన్న సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు
శుక్రవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో అజిత్ సహా మరో 12 మంది తిరుగుబాటు నేతలను శరద్ పవార్ వర్గంలోని ఎన్సీపీ బహిష్కరించింది. ఈ మేరకు దిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ తీర్మానించిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
మరోవైపు ఈ సమావేశంలో చేసిన తీర్మానాలకు చట్ట బద్ధత లేదని అజిత్ పవార్ వర్గం అంటుండటం గమనార్హం.