వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం
వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఆటోలో ఇరుక్కున్న మరో నలుగురు ప్రయాణీకులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది.
నిద్రమత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్
ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తేనెపట్టును అమ్ముకునేందుకు వరంగల్ వైపు నుంచి వర్దన్నపేట వైపుగా ఆటోలో వెళుతున్న క్రమంలో రాజస్థాన్‌కు చెందిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.