Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన తాజ్ మహల్‌ను సందర్శించారు. ముయిజ్జు తన సతీమణి సాజిదా మొహమ్మద్‌తో కలిసి ఉదయం ఆగ్రా చేరుకుని తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారు. వారు అక్కడ ఫొటోలు తీసుకున్నారు. అంతకుముందు, సోమవారం రోజున, ముయిజ్జు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతీయులు మాల్దీవులకు వస్తారని ఆశిస్తున్నా: ముయిజ్జు
తనకు ఆహ్వానం అందించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ఘన స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవుల టూరిజం విషయంలో భారతీయుల ప్రమేయం అధికంగా ఉందని, భవిష్యత్తులో మరింత మంది భారతీయులు మాల్దీవులకు వస్తారని ఆశిస్తున్నట్లు అన్నారు. ముయిజ్జు మాట్లాడుతూ, "మాల్దీవులకు ప్రతిసారీ అవసరం వచ్చినప్పుడు భారత్ స్నేహ హస్తం అందిస్తోంది. మాల్దీవుల ఆర్థికాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది," అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్-మాల్దీవుల సంబంధం వందల ఏళ్ల పురాతనమని చెప్పారు. అయితే, గతంలో ముయిజ్జు చేసిన వ్యాఖ్యలకు ఆయన తాజా వ్యాఖ్యలు భిన్నంగా ఉండటం గమనార్హం.