బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే అంతకుముందే, ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి సైతం శాసనసభ టిక్కెట్ కేటాయించాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మెదక్ టిక్కెట్ ను తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మైనంపల్లి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో హరీశ్‌రావు పెత్తనం చెలయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అంతుచూసే వరకు తాను వదలబోనని ఘాటుగా వ్యాఖ్యానించారు.రానున్న ఎన్నికల్లో హరీశ్‌రావుకు అడ్రస్ లేకుండా చేస్తానని ఆయన హెచ్చరించారు.
టిక్కెట్లు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతాం : మైనంపల్లి
ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని మైనంపల్లి కుటుంబం దర్శించుకుంది. దర్శనం తర్వాత పాత్రికేయులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని మెదక్ ఎమ్మెల్యేగా నిలబెట్టడమే తన లక్ష్యమని మైనంపల్లి తేల్చి చెప్పారు. తనకు,తన కుమారుడికి మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామన్నారు. ఒకవేళ ఇద్దరికీ టిక్కెట్ ఇవ్వకుంటే, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని హెచ్చరించారు. హరీశ్ రావు అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపణలు గుప్పించారు. తనకు ఇప్పటికే పార్టీ టిక్కెట్ ప్రకటించిందన్న మైనంపల్లి, తన కుటుంబంలోనూ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు.