Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ వారసుడిపై క్లారిటీ ఇచ్చిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) నాయకత్వం ఎవరు చేపడుతారనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నపై ఇప్పటికే ఎన్నో వివాదాలు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్టీ నేతలు, ప్రజల మధ్య ఈ అంశంపై ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ స్వయంగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. శుక్రవారం జాతీయ మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నిర్ణయం తాను ఒంటరిగా తీసుకోవడం లేదని, పార్టీలోని సమిష్టి నిర్ణయమే అంతిమంగా ఖరారవుతుందని స్పష్టం చేశారు.
సీనియర్ నాయకులు కూడా ముఖ్యమే : మమతా బెనర్జీ
టీఎంసీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎవరూ ఆధిపత్యం చెలాయించలేరని చెప్పారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఉందని, అయితే సీనియర్ నాయకులు కూడా ముఖ్యమే అని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూత్ వర్కర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. నేటి యువత రేపు సీనియర్ నాయకులుగా మారుతారని, టీఎంసీలో యువ నాయకత్వానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.