మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు పెల్లుబీకుతున్నాయి. ఈ నేపథ్యంలో రేఖా దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 12న కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోకపోవడంపై పాత్రికేయులు ప్రశ్నించారు. ఏలాంటి ఫిర్యాదు తనకు అందలేదన్న రేఖా, జులై 19న వీడియోలు వైరల్ కావడంతోనే సుమోటోగా స్వీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
మే 18, మే 29, జూన్ 19 తేదీల్లో లేఖలు రాసినా అధికారులు స్పందించలేదు : మహిళా కమిషన్
నగ్నంగా ఊరేగించిన అకృత్యాలపై తనకు గతంలో ఫిర్యాదులు అందినట్లు కమిషన్ ఛైర్మన్ ఆంగీకరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని మే 18, మే 29, జూన్ 19 తేదీల్లో మొత్తం మూడు సార్లు మణిపూర్ అధికారులకు రాసిన లేఖలను రేఖాశర్మ బహిర్గతం చేశారు. తొలుత మహిళలపై హింస జరిగినట్లు మణిపూర్ సహా ఇతర రాష్ట్రాల నుంచీ లేఖలు వచ్చాయన్నారు. పలు లేఖలు విదేశాల నుంచి వచ్చాయన్నారు. ఈ మేరకు అన్ని లేఖలను ప్రామాణికత పరిశీలించకుండా స్వీకరించలేమన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం సదరు నిందితులకు మరణశిక్ష విధించేందుకు వెనకాడేది లేదని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఇటీవలే స్పష్టం చేశారు.