మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి
మణిపూర్ అల్లర్లకు సంబంధించి మే నుంచి సుమారు 6 వేల ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. కానీ కేవలం 657 మంది నిందితులనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయా కేసుల్లో హత్యలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. సుమారు 70 హత్య కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే అసలు నేరస్తులను వదిలేసి నేరానికి సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మే 3న రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో ఇంఫాల్ లోయ, పర్వత ప్రాంతాలకు చెందిన దాదాపు 657 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేయాల్సిన కేసుల సంఖ్య భారీగానే ఉన్నా విచారణ చేపట్టేందుకు ఎస్సై స్థాయి అధికారుల కొరత వేధిస్తోంది.
అరెస్టైన వ్యక్తులను తరలించేందుకూ సిబ్బందికి కొరత
అయితే అలజడులను శాంతపర్చడానికే మణిపూర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులపై పెద్దగా దృష్టి పెట్టలేదని సమాచారం. ప్రతిరోజూ సుమారు 75 కేసులు నమోదవుతుండటంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. విచారణలకు సైతం సిబ్బంది పరిమిత సంఖ్యలోనే ఉండటంతో కేసుల్లో పురోగతి లేకపోయింది. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కొన్నిసార్లు స్థానికులు, నిందితులను విడిపించేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే అరెస్టైన వ్యక్తులను తరలించేందుకూ సిబ్బంది కొరత ఉంది. పలు సందర్భాల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌లు సైతం నమోదయ్యాయి. నేరం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కేసు నమోదు చేయవచ్చు. దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఇందులో లింగ బేధం ఉండదు. అందరికీ ఒక్కటే రూల్ వర్తిస్తుంది.
ఇద్దరు మహిళల ఘటనలపై జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఒకరిపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఇప్పటికే పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు పోలీసులు 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేశారు. ప్రస్తుతం అల్లర్లు వ్యాప్తి చెందడం కారణంగా అరెస్ట్ చేసిన వారిని జైలుకు తరలించడం పోలీసులకు అతిపెద్ద సవాల్ గా మారింది. రాజధాని ఇంఫాల్‌లో ప్రస్తుతానికి శాశ్వత జైలు ఒక్కటే ఉంది. అయితే పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నిరసనకారులు అరెస్టైన క్రమంలో సదరు వ్యక్తులకు వసతి కల్పించేందుకూ రాష్ట్రంలో ఇబ్బందులున్నాయి. ఈ మేరకు నిందితులను ఇతర ప్రాంతాలకు తరలించడం కోసం మణిపూర్ పోలీస్ శాఖ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది.