Page Loader
మణిపూర్‌ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్
సరుకులు కొంటుండగా యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్

మణిపూర్‌ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 26, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మహిళలపై దాష్టీకాలకు కేంద్రంగా నిలుస్తోంది. రక్షించాల్సిన పోలీసులు, ఆర్మీ భక్షిస్తోంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు, సిబ్బందిలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా రాజధాని ఇంఫాల్ నగరంలో జరిగిన మరో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ కిరాణా షాపులో మ‌హిళ‌ను వేధించిన కారణంగా బీఎస్ఎఫ్ జ‌వాన్‌ స‌స్పెండ్ అయ్యాడు. కిరాణా దుకాణంలో సరుకులు కొంటున్న యువతిని, 100వ బెటాలియన్‌కు చెందిన సతీష్ ప్రసాద్ అనే బీఎస్ఎఫ్ జ‌వాను(HEAD CONSTABLE) ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ, శరీరాన్ని తాకుతూ వేధింపులకు గురిచేశాడు. ఈనెల 20న జరిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో తాజాగా వైర‌ల్ అయ్యింది.

DETAILS

సతీష్ ప్రసాద్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన బీఎస్ఎఫ్ 

విషయం తెలియడంతో సదరు జ‌వాన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు బీఎస్ఎఫ్(BSF) ఉన్నతాధికారులు ప్రకటించారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశారు. INSAS రైఫిల్‌తో ఉన్న సతీష్ ప్రసాద్ జులై 20న ఇంఫాల్‌లోని ఓ పెట్రోల్ బంకుకు స‌మీపంలో ఉన్న కిరాణా షాపులోకి ప్రవేశించాడు. ఓ చేత్తో రైఫిల్ పట్టుకుని, మరో చేత్తో ఓ యువతిని పదేపదే తాకడం ప్రారంభించాడు. ఈ చేష్టలకు భయపడిపోయిన బాధితురాలు విషయాన్ని దుకాణం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. షాపులో కిరాణ సామగ్రి కొంటున్న యువతిని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం సీసీటీవీ (CCTV) వీడియోలో నమోదైంది. అనంతరం మార్ట్ యాజమాన్యం ఆ వీడియోని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్ అయ్యింది.

DETAILS

అడ్‌హక్ యూనిట్‌ సభ్యుడిగా హెడ్ కానిస్టేబుల్ సతీష్ ప్రసాద్

రాష్ట్రంలో అల్లర్లను అదుపు చేసి, ప్రజలకు భద్రతా కల్పించేందుకు ఇటీవలే అడ్‌హక్ యూనిట్‌ను మణిపూర్‌కు పంపించారు. ఈ బృందంలో సతీశ్ ప్రసాద్ సభ్యుడిగా ఉండటం గమనార్హం. ఇప్పటికే హింసాకాండతో మణిపూర్‌ మొత్తం అట్టుడికిపోతోంది. రాజధాని ఇంఫాల్‌కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న మహిళలపై దారుణం జరిగింది. ఇద్దరిని నగ్నంగా ఊరేగించిన దుండగులు, తర్వాత పొలాల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన జులై 19న ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా దేశాన్ని కుదిపేసింది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణతో మణిపూర్‌లో మహిళలకు భద్రత లేకుండా పోవడం దేశంలో కల్లోలం రేపుతోంది.