Page Loader
AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు

AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ప్రముఖ నేతలు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఈ కేసులో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వీరిద్దరికి సమన్లు జారీ చేసింది. ఇందులో పేర్కొన్న ప్రకారం, సత్యేందర్ జైన్ ఈ నెల 6న, మనీశ్ సిసోదియా 9న ఢిల్లీలోని బ్యూరో కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది.

వివరాలు 

దాదాపు రూ.2,000 కోట్ల అవకతవకలు

అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఆప్ పార్టీ పాలనలో ఉన్న సమయంలో మనీశ్ సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో మొత్తం 12,748 పాఠశాల భవనాలు,తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే, ఈ నిర్మాణాలలో దాదాపు రూ.2,000 కోట్ల అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టులకు 34 మంది కాంట్రాక్టర్లు నియమించబడ్డారు. వారిలో చాలా మంది వ్యక్తులకు ఆప్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

వివరాలు 

ప్రాజెక్టు ఖర్చు అదనంగా రూ.326 కోట్లు పెరిగింది 

ఇంత పెద్ద ప్రాజెక్టు అయినప్పటికీ, నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాలేదు.పైగా, అప్పటికే భారీ ఖర్చులు చేశారు. తరగతి గదుల నిర్మాణం 30 ఏళ్ళ పాటు నిలబెట్టేలా ఉండేలా డిజైన్ చేసినప్పటికీ, వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా, నియమాల ప్రకారం టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్లను నేరుగా నియమించడంతో ప్రాజెక్ట్ వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిపోయింది. తాజాగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) విడుదల చేసిన నివేదికలో కూడా ఈ తరగతి గదుల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా పేర్కొంది. కొత్త టెండర్లను పిలవకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ఖర్చు అదనంగా రూ.326 కోట్లు పెరిగిందని అదే నివేదికలో వివరించారు.

వివరాలు 

ఏప్రిల్‌లో వీరిద్దరిపై అధికారికంగా కేసులు నమోదు

నివేదిక ఆధారంగా సిసోదియా, జైన్‌లపై విచారణ జరిపేందుకు ఈ సంవత్సరం మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ అనుమతిని ఇచ్చారు. దాంతో ఏప్రిల్‌లో వీరిద్దరిపై అధికారికంగా కేసులు నమోదు అయ్యాయి.