
Hyderabad: చార్మినార్ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
ఒక భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారి తీశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.
అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
భవనంలో చిక్కుకున్న ఇతరులను రక్షించే చర్యలు కూడా తీసుకుంటున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.
Details
దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందిన విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యక్షంగా పరిశీలించి, పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు.
Details
సహాయక చర్యల్లో ఆలస్యం : కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కూడా సంఘటనాస్థలాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు చెప్పారు.
ఈ ప్రమాదంలో సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందన్న ఆరోపణలు బాధితుల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు.
పెద్ద ప్రమాదం కాకపోయినా, ప్రాణ నష్టం అధికంగా నమోదైందని అభిప్రాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బందికి తగిన శిక్షణ, పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.