Summer: మార్చి మొదటి వారంలోనే వడగాలుల దడ.. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి తొలి వారంలోనే భయపెట్టే స్థాయిలో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.
సాధారణ స్థాయితో పోలిస్తే,బాపట్లలో 4.5 డిగ్రీలు,మచిలీపట్నంలో 3.6 డిగ్రీలు,నరసాపురంలో 3.2 డిగ్రీలు,కాకినాడ, విశాఖపట్టణంలో 2.9 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
బుధవారం అనకాపల్లి జిల్లాలోని 2 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రమైంది.
మొత్తం 72 మండలాల్లో వీటి ప్రభావం కనబడింది. గురువారం 148 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
పశ్చిమగోదావరిలో ఒక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4 మండలాల్లో తీవ్ర స్థాయిలో ప్రభావం ఉండొచ్చని చెప్పారు.
శుక్రవారం 3 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 94 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదవుతాయని వివరించారు.
వివరాలు
గురువారం వడగాలులు వీచే మండలాలు
తీవ్ర వడగాలులు (5): అల్లూరి సీతారామరాజు జిల్లా: అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం మండలాలు పశ్చిమగోదావరి జిల్లా: ఆకివీడు
వడగాలుల ప్రభావం ఉండే మండలాలు (143): శ్రీకాకుళం - 11 విజయనగరం - 17 పార్వతీపురం మన్యం - 9 అల్లూరి సీతారామరాజు జిల్లా - 6 కాకినాడ - 2 తూర్పుగోదావరి - 16 పశ్చిమగోదావరి - 16 ఏలూరు - 14 కృష్ణా - 19 గుంటూరు - 12 బాపట్ల - 15 పల్నాడు - 1 ఈ వడగాలుల తీవ్రతకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.